Monday, May 20, 2024

కొడాలి నాని ముందు కొత్త సెంటిమెంట్ సవాలు-ఎవరికీ ఐదు వరుస విజయాలివ్వని కృష్ణా జిల్లా!

by telugudesk1

– ఐదోసారి ఓడిన దేవినేని నెహ్రూ, దేవినేని ఉమా
– ఈసారీ ఈ ఆనవాయితీ పునరావృతమవుతుందా?

పాటిబండ్ల శ్రీనివాస్
pnsjournalist@gmail.com

అమరావతి: కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా వరుసగా ఐదోసారి చట్టసభకు ఎన్నిక కాలేదు. కృష్ణా జిల్లా రాజకీయ చరిత్రలో ఇదో సెంటిమెంట్‌గా మారింది. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఆ సెంటిమెంటును బద్దలుకొట్టి ఐదోసారి గెలుస్తారా..? అనేది ఇపుడు చర్చనీయాంశంగా మారింది.

కొడాలి నాని గత నాలుగు ఎన్నికల్లో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నిరాటంకంగా గెలుపొందారు. 2004, 2009లో తెలుగుదేశం టిక్కెట్‌పై రెండుసార్లు గెలిచారు. తర్వాత టీడీపీ నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్‌పై రెండుసార్లు ఎన్నికయ్యారు. మొదటి మూడేళ్లు 2019 నుండి 2021 వరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఆయన సభ్యుడు కూడా.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆయన పదవిని కోల్పోయారు. ఇపుడు మాజీ మంత్రి హోదాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలో వున్నారు. ఈసారి ఆయన నిజమైన సవాలును ఎదుర్కొంటున్నారు.

కృష్ణా జిల్లా రాజకీయ చరిత్ర చూస్తే.. వరుసగా ఐదోసారి ఏ నాయకుడూ చట్టసభకు ఎన్నిక కాలేదు.
గతంలో దేవినేని రాజశేఖర్ (నెహ్రూ), దేవినేని ఉమామహేశ్వరరావు, చనుమోలు వెంకటరావు వంటి సీనియర్ నేతలు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఈ ముగ్గురు నేతలూ కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఐదుసార్లు ఎన్నికైనప్పటికీ వరుసగా కాకపోవటం గమనార్హం!

దేవినేని నెహ్రూ 1983, 1985, 1989, 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్‌పై వరుసగా నాలుగుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ కేబినెట్‌లో కొన్ని నెలలపాటు మంత్రిగా ఉన్నారు. కృష్ణా జిల్లా రాజకీయాల్లో మరో ఎన్టీఆర్‌గా గుర్తింపు తెచ్చుకున్నా ఎన్టీఆర్‌ మరణానంతరం సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. టీడీపీని వీడి 1999 ఎన్నికల్లో తొలిసారి ఆయన ఓడిపోయారు. తర్వాత 2004 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.

అలాగే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. తన సోదరుడు దేవినేని వెంకట రమణ మరణానంతరం ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. వీరిద్దరూ స్వర్గీయ దేవినేని నెహ్రూ మద్దతుతో రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. 1999 ఎన్నికల్లో నెహ్రూ కాంగ్రెస్‌కు విధేయులుగా మారినప్పటికీ వారు మాత్రం టీడీపీలో కొనసాగారు.

దేవినేని ఉమా 1999, 2004 ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. తర్వాత నందిగామ నియోజకవర్గాన్ని ఎన్నికల సంఘం ఎస్సీ వర్గానికి రిజర్వ్ చేయడంతో ఆయన మైలవరం నియోజకవర్గానికి మారారు. 2009, 2014 ఎన్నికల్లో మైలవరం నుంచి వరుసగా రెండుసార్లు ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉమా సభ్యుడు.
కృష్ణా జిల్లా టీడీపీ రాజకీయాల్లో కూడా ఆయన ప్రధాన పాత్ర పోషించారు. కానీ 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దేవినేని ఉమా, ఆయన బంధువు దేవినేని నెహ్రూ విషయంలోనూ ఐదోసారి గెలవలేని సెంటిమెంట్ రుజువైంది! గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత చనుమోలు వెంకటరావు కూడా కృష్ణా జిల్లాలో ఐదుసార్లు శాసనసభకు ఎన్నికైనప్పటికీ వరుసగా కాకపోవటం గమనార్హం.

గుడివాడ నియోజకవర్గం నుంచి ఐదోసారి ఎన్నికలను ఎదుర్కొంటున్న కొడాలి నాని ఈ సెంటిమెంటును అధిగమిస్తారా..? అనేది ఇపుడు కృష్ణా జిల్లా రాజకీయాల్లో బిలియన్ డాలర్ల ప్రశ్న! అధికార పార్టీకి ఎదురయ్యే వ్యతిరేకత, నియోజకవర్గంలోని అధ్వాన్నమైన రోడ్లు, ఎలాంటి అభివృద్ధి జరగకపోవడం ప్రస్తుత ఎన్నికల్లో కొడాలి నాని ముందున్న ప్రధాన సవాళ్లు.

You may also like

Leave a Comment

Our Company

NO1 Teugu News Proudly presented by The Capital Media Group. 24 Hours Web News and Youtube Web Channel and The Capital EPAPER.

Andhra Pradesh Office

D NO – 40-5/3-12

DR KONERU STREET

NEAR DV MANOR, VIJAYAWADA

ANDHRA PRADESH

info@thecapital.org.in

Telangana Office

P-350 , VV COLONY

KUKATPALLY

HYDERABAD

TELANGANA

info@thecapital.org.in

Laest News

Designed and Developed By  Capital Media Group. New Delhi